కోటి తారల సేవ ఎల్ల వేళలా పొందు 
గగన సీమకు నిత్య దీపావళి 
రత్న మౌక్తిక దీప్తి గర్భమ్మున  దాల్చి 
ఎగయు సాగరునికి సతత దీపావళి 
పైరు  పచ్చని చీరల అలరు కల్పవల్లి
పుడమి తల్లికి పచ్చ దీపావళి 
ముగ్ధ మోహన రూప నా చెలియ నగుమోము 
నిండు పున్నమి నాకు దీపావళి












నువ్వు లేకపోతే
నాకు గడవదు అనుకున్నావా ?
నన్ను కౌగిలించుకోడానికి
నిశ్శబ్దం  సిద్ధంగా వుంది.
మేం నిశీధి దుప్పటి కప్పుకొని  
మౌనంగా వూసులడుకుంటాం..
 వేళ్ళ నీడలతో బొమ్మలు చేసి
తమాషాగా ఆడుకుంటాం ..
అనంతమైన తారలలో
ఆకృతులను  వెదుక్కుంటాం ..
చడి చప్పుడు లేకుండా
కాలం చుట్టి వెళ్లిపోతుంటే..
జొరబడే జ్ఞాపకాలను
కనురెప్పలక్రింద దాచేసి...
దొంగనిద్ర నటిస్తూంటాం ...
నువ్వు లేకపోతే
నాకు గడవదు అనుకున్నావా ?..
అందమైన ఊహల
బొమ్మలుగీచేపని నాకు వుండదు..
సంధ్యా సౌందర్యం నాకిక
ఏమాత్రం గుబులు పుట్టించదు ...
ఎంత హాయిగా ఉంటానో చూడు..
వాన.. వెన్నెల..
మల్లెలు.. గులాబీలు.. ఎవరికి  కావాలి ?
ఏమీ అక్కరలేనితనం
ఎంత ఆనందమో ?!

















అద్దమంటే నాకు ఎంతో ఇష్టం.
నేనేమిటో నాకు ఇంకెవరు చూపుతారు ?
అద్దంలో నా బొమ్మ,
నేను నవ్వితే నవ్వుతుంది...
ఏడిస్తే ఏడుస్తుంది...
అద్దం ఎప్పుడూ అబద్దం చెప్పదు.
కుడీఎడమగా అంతా..
యదార్ధమే చూపుతుంది.
పగిలి ఎన్ని ముక్కలైనా..
అన్నిటిదీ ఒకే మాట. 
అద్దం లేకపోతే,
నేనున్నానోలేదో..
నాకెలా తెలుస్తుంది ?
అద్దం లేకపోవటమే అద్వైతమా?
అంతా మరచిపోవటమే అమరత్వమా?
ఆశలేనివాడికి
అద్వైతం అమరత్వం ఏవీ  అక్కర్లేదు.



చీకటి.. నిశ్శబ్దం..
నాకేమీ కొత్త కాదులే..
ఎన్నిఏళ్ళ స్నేహం మరి!!?
ఎన్ని సార్లు తమనుంచి
తప్పిపోయినా..  తప్పించుకున్నా..
తప్పని ఒక్కసారికూడా ఆనవు.
తలవంచుకు తిరిగొస్తే..
తలుపెన్నడు మూసేయవు.. .

జ్ఞాపకాల మొక్కలు మహా వృక్షాలై
ఆశలు పుష్పిస్తున్నై.
స్వప్నానికి సత్యానికి భేదం ఏమిటి?
మనసుకి ఆనందాన్నిచ్చేది ఏమైతేనేం?
ముల్లుగుచ్చుకున్న జ్ఞాపకమూ సంతోషమే..
అది గులాబీదైతే.



బ్రతికి వత్తును ఎన్ని మార్లైన మరల..
ఈ నిశ్శబ్దదగ్ధ భస్మరాశులనుండి..
కురియ శీతల తుషారసమీరమ్ము..
నీ నేస్తపు పల్కరింతయై ఆత్మపై.
స్మృతుల వానలోన..
చెలమలైన  కనుల..
అశ్రుధారలన్ని కైతలైన ..
ఖండ కావ్యమొకటి వ్రాయలేనా నేను...
హృదయభగ్న రుధిరధార నుండి.


నాలో నేనే
నాతొ నేనే
వెన్నెల్లో ఆడుకున్నా..
వానల్లో వెల్లువయ్యా..
వెన్నెల వెళిపోయింది..
వాన వెలిసి పోయింది.
కోపం.. ఉక్రోషం..
దుఖం.. నిర్వేదం..
ఎవరిమీద ఎవరికి
ఫిర్యాదు చెయ్యాలి?
ఇక్కడ నేనుతప్ప ఎవరూ లేరు.
నిర్వేదపు మైదానంలో..
నిజం మొలిచి ఎదుట నిలిచి
అద్వైతం బోధించింది.
అంతా నేనే!!
స్వార్ధం శిఖరమ్మీద నిలబడి
రంగుల గాలిపటాలు ఎగురేస్తున్నాను.
నరాల సాలెగూటిలో ఉద్వేగాల ఊగులాట..
ఒక్క వెర్రి కేకపెట్టి విదిలించుక పోదామంటే..
ఆశలు వేల గొంతుకలతో అరుస్తున్తున్నై.
ఎవరితో ఈ పెనుగులాట? నాతొ నేనే!!
ముక్తికావాలి... నానుంచి నాకే..





 
   జ్ఞానం దుఖ్ఖాన్ని మాత్రమే ఇస్తుందేమో ....
   దీపం వెలిగాక నీడలన్నీ మాయమవుతాయి.
   నేను నాకోసమే నాచుట్టూ తిరుగుతున్నా..
   ఎవరో అచ్చంగా నాకోసం వచ్చేయాలని.
   ఎవరొచ్చి ఉండిపోతారు... అందరూ నాలాగే.
  తెలుసుకోవడం తెలివో తెలియకుండటం సులువో.
  ఇంటర్నెట్లో వేలాడే వేలాది వొంటరి ఆత్మలు... 
  భూగోళపు ఇరుసులో పరిభ్రమిస్తూ తపిస్తున్నై...
  అద్దంలో బొమ్మలాగా అందమైన చెలిమి కోసం.



                                                                                                                                                                               వీచే చిరుగాలిలోన
పారే సెలయేరులోన
పలికే జీవననాదం...
ఉషస్సులో భూపాలం
సాయంత్రపు  నీలాంబరి  
జగమంతా వల్లెవేయు సామవేదము ... 


వే


కఠిన గండశిల ఒకటి నిలుచుంది కొండపై   
మృదుల మేఘరాశి   తనను తాకి పోవు... 
తరుల ఛాయను నిలిచి విరుల వానల తడయు....
పగటిఎన్దల కాగి  రాత్రి వెన్నెల సోలు....
మంచుదుప్పటిమాటు నిదురపోవు...
రుతువులన్నింటికి ఎదురెళ్ళి తోడ్కోచ్చు...
వానపాటలు పాడు.... పూలబరువులు మోయు....
 కాలగతిన ఋతువు తనదారి తాపోవ...
నిలచు నీరవ నిశిని బెంగటిల్లి...
కరకురాతికేల నేస్తమ్ము  గీస్తమ్ము...
నవ్విపోవునుసుమీ లోకమంతా....  

 జనవాహిని లోంచి రైలు బండిలోకి ఎక్కుతూ
వెనక్కి తిరిగి చూస్తే  నేనొక్కడినే ,
గమ్యం చేరాక రైలు దిగేటప్పుడు నేనొక్కడినే ,
జ్ఞాపకాల వీధుల చీకటి వెలుగుల్లో
సంచరిస్తూ  నేనొక్కడినే ,
వాన కురిసి గుబులు పుడితే,
వేడి ఎండలు సెగలు పెడితే,
 ఆకలేస్తే,దాహమేస్తే ,పోద్దువాలి చీకటైతే ,
నిదుర రాక  బెంగపడితే,  అమ్మ కోసం తపన పడితే,
నేనొక్కడినే.....