ఈ రోజు కూడా నీ ఉత్తరం రాలేదు ... 

జీవితపు యాంత్రిక భ్రమణం లో 

ఎప్పుడో ఒక క్షణం నీ తలపు 

మనసుపై ఇంద్రజాలం చేసి 

తత్వాన్ని , తర్కాన్ని తలక్రిందుగా తోసి 

నన్ను  వెక్కిరించి పోతుంది ... 

రాని నీ ఉత్తరం కోసం 

ఎదురుచూడటం 

నీ జ్ఞాపకానికి నీరు పోయటం .... 



తెలియడంలేదు 

నేను ఎక్కడ వున్నానో ... 

 ఎక్కడికి వెళ్లాలో తెలిస్తే కదూ. 

తెలియనప్పుడు ఎక్కడున్నాఒక్కటే ... 

జ్ఞాపకాల దారాలలో  తిరిగే సాలీడు 

ఎంత తిరిగినా ఎక్కడికి వెళుతుంది?

 

 



 

 

 



 

 


 

 

జ్ఞాపకం చిత్రమైనది . 

 ఏ భౌతికశాస్త్రనియమం 

దానికి వర్తించదు. 

గతానికి వర్తమానానికి నడుమ 

దూరంతో  దీనికి పనిలేదు. 

ఎటునుంచి దూసుకువస్తుందో 

ఎవరూ పసికట్టలేరు.. 

కంటికి కనపడదుకాని 

దాని  భారం  అమితం . 

కాలం అన్నింటినీ మరిపిస్తుంది అంటారుకాని .. 

కొన్ని జ్ఞాపకాలు కాలంతోనే  చెల్లుతాయి. 

సప్తవర్ణశోభితాలు జ్ఞాపకాలు. 

సమస్తలోక చాలకాలు జ్ఞాపకాలు.

 

 

 

 

 

 

పదాల వర్షం ... 

ఆలోచనల అలలు ... 

రాత్రిoబవళ్ళు ఎడతెగని ఝడి.

ఆశ.... స్వార్ధం.. 

ఇష్టం .. పగ ... ప్రేమ .. 

పేరు.. ఆస్థి ... పదవి ... 

ఎదో ఒక బండక్రింద ఇరుక్కుని 

పెనుగులాడుతున్న జీవితాలు.

ఇంతేనా  జీవితం అంటే  ..... ?

కాదు అనిపిస్తుంది. 

ఐతే  ఇంకేంటో  తెలియటం లేదు.

తెలిసినట్టు కాసేపు అనిపించినా 

తెలిసిపోతుంది నాకేమీ తెలియదని. 

ఎండమావి వైపు పరుగు 

చేరనంతవరకూ సుఖంగానే ఉంటుంది.


 

 



 

 అన్నీ సాపేక్షమే ... 

అసలువిషయం ఎవరికీ తెలియటం లేదు.. 

సుఖం దుఃఖం .. ఆనందం ఆక్రోశం ..

దగ్గర దూరం .. లాభం నష్టం ... 

ఎన్నో ద్వందాలు ... అన్నీఅస్థిరమే. 

వెళ్ళేది ముందుకో వెనొక్కొ .. 

ఏమీ తెలియటం లేదు.


దేన్నీ పట్టుక వేలాడకపోవటం 

వైరాగ్యం అవునోకాదో ... 

 అంతా నిండిపొయ్యాక మిగిలే ఖాళీతనం

వైరాగ్యం అవవునోకాదో ...

ఆలోచన .. ఊపిరి కలిసిపోయిన క్షణాలు

వైర్రాగ్యం అవునోకాదో.

నేనుకూడా లేనిచోట 

ఎవరికోసమో ఎదురుచూసే 

ఒక అద్వైతావస్థ... 

అది నీకోసం  అని పొరపాటునకూడా 

అనుకోవద్దు.. నేనూ పొరబడ్డా.. 

 






 



మరణించాక జీవించటం అమరత్వమైతే
నన్ను అమరుణ్ణి చేసింది నువ్వే..