సాయంత్రం వేళ
దోసిట పూలతో
రాతిరి వాకిట్లో నిలుచున్నా..
రంగుకి రూపానికి ఉనికిలేని చీకటిలో
నిమజ్జనమయ్యేందుకు.
సప్తవర్ణాలు కలిసిన.. సర్వ కాలాలు నిలిచిన
సుందర స్నేహపుష్పాలివి..
లేత పూలరేకులకు ఇంత బలం ఏమిటో ..
కత్తి కన్నా పదునుగా గుండెను కోసేస్తున్నై...
గుండెకి ఏమీ కాదులే .. అది ఖాళీగానే వుంది.
ఈ చీకటికి ఎదురు నడుస్తూ వేచి వుంటా
ఉషస్సు కోసం... ఆ వెలుగులో మెరిసే ఈ పూలకోసం ..
నీ పరిచయ మేఘచ్చాయలో
శరత్తు చల్లగా గడచిపోయింది ..
నీ స్నేహపు నీరెండలో
శిశిరం వెచ్చగా నడిచిపోయింది ..
ఎపుడు వెళి పోయాయో తెలియదు
హేమంత వసంతాలు..
ఎటు వెళ్లిపోయావ్ నువు ?..
ఇంతలోనే భగ్గుమంది గ్రీష్మం .
ఏదో కార్చిచ్చు
నన్ను పూర్తిగా ధగ్దం చేసింది.
నేను ఇప్పుడు ఒక భస్మ రాశిని.
చిరుగాలి తరంగాల తాకిడికే
కొద్ది కొద్దిగా కరిగిపొతున్నా..
ఎక్కడి పోతేనేం? అస్తిత్వం పోయాక.
అయినా ఏదో ఆత్మఘోష.
నన్నునేను నిమజ్జనం చేసుకోవాలి
ఒక దోసిలి గంగాజలంలో ...